
‘కూటమి’కి బుద్ధి చెబుతాం
● విద్యారంగ, ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి
● యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్‌కుమార్
గుంతకల్లుటౌన్: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి అన్నారు. విద్యారంగ, ఆర్థిక సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమానికి సంబంధించిన ప్రచార జాతా మంగళవారం గుంతకల్లుకు చేరుకుంది. రణభేరిని విజయవంతం చేయాలంటూ స్థానిక సరోజినీనాయుడు మున్సిపల్ స్కూల్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ ఉపాధ్యాయులు బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే పీఆర్సీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, సహ అధ్యక్షుడు రామప్పచౌదరి, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, స్థానిక నాయకులు శ్రీనివాసులు, రవిబాబు, శంకరయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చొరవ చూపకపోతే తీవ్ర పరిణామాలు
ఉరవకొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. యూటీఎఫ్ అధ్వర్యంలో చేపట్టిన రణబేరి ప్రచార జాతా మంగళవారం ఉరవకొండలో ప్రవేశించింది. స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్‌కుమార్, లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి మాట్లాడారు. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. పిల్లలకు పాఠాలు చెప్పినివ్వకుండా ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అంటగట్టి, యాప్‌ల పేరుతో వేధింపులకు గురి చేస్తోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే బోధనేతర పనులను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, పూర్వ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, శేఖర్, మండల నాయకులు పాల్గొన్నారు.