
సమస్యలు పరిష్కరించండి
● ‘పరిష్కార వేదిక’కు 334 వినతులు
అనంతపురం అర్బన్:సమస్యలు పరిష్కరించండంటూ ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునరెడ్డి, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 334 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు.
వినతుల్లో కొన్ని..
● అనంతపురం రూరల్ పంచాయతీ భైరవ నగర్‌లో అక్రమంగా సెల్‌టవర్ నిర్మిస్తున్నారని లక్ష్మిదేవి, వెంకటేష్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం భద్రతా చర్యలు చేపట్టకుండా సెల్ టవర్ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
● తమ భూమిలోకి తాము వెళ్లకుండా కొందరు అడ్డుపడుతున్నారని కంబదూరు మండలం తిప్పేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మాదిగ చిన్నపెద్దన్న ఫిర్యాదు చేశాడు. నూతిమడుగు గ్రామ పొలం సర్వే నంబరు 559–3లో 4.99 ఎకరాల డీ పట్టా భూమి ఉందని చెప్పాడు. పక్క పొలం వారు తమను పొలంలోకి వెళ్లనీయకుండా దారి లేదని చెబుతూ మూసివేశారని చెప్పాడు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
● బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 11 ఏళ్ల కుమారుడు శశికుమార్‌కు పింఛన్ మంజూరు చేయించాలని బుక్కరాయసముద్రం మండలం గేనే కాలనీకి చెందిన లక్ష్మి విన్నవించింది. శశికుమార్ కనీసం కదల్లేడని చెప్పింది. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని, వేలిముద్రలు పడడం లేదని చెబుతున్నారని వాపోయింది. ఉన్నతాధికారులైనా స్పందించి పరిష్కరించాలని వేడుకుంది.