
ఆత్మకూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామానికి చెందిన శీనప్ప కుమారుడు హరిజన కుంటెన్న (37)కు భార్య ముత్యాలమ్మ, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
ఈ క్రమంలో మూడేళ్ల క్రితం శీనప్ప మృతి చెందాడు. అప్పటి నుంచి వ్యవసాయంతోపాటు ఇంటి బాధ్యతలు కుంటెన్నపై పడ్డాయి. ఇటీవల 3.8 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోగా, వాటిని తొలగించాడు. వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. సోమవారం భార్యాపిల్లలు ఆమె పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కుంటెన్న మధ్యాహ్నం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.