
దిక్కుతోచని అన్నదాతలు
● ‘పచ్చ’ నేతల కనుసన్నల్లో యూరియా అమ్మకాలు
● రైతులకు తప్పని తిప్పలు
అనంతపురం అగ్రికల్చర్: ‘పచ్చ’ నేతల కనుసన్నల్లో యూరియా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో సాధారణ రైతులకు నెల రోజులుగా యూరియా తిప్పలు తప్పడం లేదు. జిల్లాకు చేరుతున్న యూరియాను ‘తెలుగు తమ్ముళ్లు’ పంచుకుంటున్నారు. తాము చెప్పిన వారికే యూరియా ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తుండటంతో అధికారులకు పాలుపోవడం లేదు. ఈ క్రమంలో రైతులు ఉదయం 6 గంటలకే ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, దుకాణాల వద్ద బారులు తీరుతున్నా ఒక్క బస్తా కూడా దొరకని దుస్థితి నెలకొంది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టనష్టాలపై ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం ఇలా ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాకిలెక్కలతో బురిడీ..
యూరియాపై కాకిలెక్కలతో వ్యవసాయశాఖ అధికారులు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. 4,600 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 436 ఆర్‌ఎస్‌కేలు, మూడు డీసీఎంఎస్‌లు, 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), రెండు ఎఫ్‌పీఓలు, మూడు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లు, 460 రీటైల్ దుకాణాల్లో యూరియా నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. అంతో ఇంతో ఉన్న యూరియా ‘తమ్ముళ్ల’కే సరిపోతోందని చెబుతున్నారు. అలాగే అధికార పార్టీ నేతల కోసం బఫర్‌స్టాక్ కింద మాత్రం 700 మెట్రిక్ టన్నులు పెట్టుకున్నారు. ఈనెలలో మంచి వర్షాలు పడటంతో పంటల సాగు పెరిగింది. యూరియా వాడకం అవసరం కావడంతో రైతులు ఎగబడుతున్నా ఒక్క బస్తా దొరకడం కూడా కష్టంగా మారింది.
కణేకల్లులోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం ఎండలో నిరీక్షిస్తున్న రైతులు
కణేకల్లు ఆదర్శ భారతి రైతు సేవా సహకార సంఘం వద్ద రైతుల రద్దీ
మండుటెండలో పడిగాపులు
కణేకల్లు: హెచ్చెల్సీ ఆయకట్టు ప్రాంతమైన కణేకల్లులో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కణేకల్లు పీఏసీఎస్, ఆదర్శభారతి రైతుసేవా సహకార సంఘం, బ్రహ్మసముద్రం పీఏసీఎస్‌లతోపాటు గెనిగెరలో రెండు ఫర్టిలైజర్ షాపులు, బెణికల్లు ఒకటి, యర్రగుంట ఒకటి, కణేకల్లులో ఒకటి, కొత్తపల్లి ఒక ఫర్టిలైజర్‌షాపులకు యూరియా సరఫరా అయ్యింది. ఒక్కో సొసైటీకి 18.45 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకే సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎండవేడిమికి తట్టుకోలేక అల్లాడిపోయారు. కణేకల్లులోని ఆదర్శభారతి రైతుసేవా సహకార సంఘం, కణేకల్లు పీఏసీఎస్‌కు రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏఎస్‌ఐ శంకర్‌రెడ్డితోపాటు పోలీసులు పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకొని రైతులకు సర్దిచెప్పారు. గంటల సమయం వేచి ఉన్నా దొరుకుతోంది ఒక్క బస్తానే కావడంతో రైతుల వేదన వర్ణనాతీతంగా మారింది. యూరియా కోసం నిత్యం కుస్తీలు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, తాగుబోతులకు ఎంత కావాలన్నా మద్యం దొరుకుతోంది కానీ రైతన్నకు మాత్రం కావాల్సినంత యూరియా లభించడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు.

దిక్కుతోచని అన్నదాతలు