రాయదుర్గం:అనధికారికంగా నడుపుతున్న బొగ్గు బట్టీలను గుర్తించి అక్రమ రవాణా జరిపే వారిపై నివేదిక పంపాలని విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం నుంచి జిల్లా అటవీశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. సోమవారం ‘పచ్చదనం బొగ్గుపాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక కోరారు. ఈ క్రమంలోనే డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళుతున్నట్టు సమాచారం.
‘దుర్గం’లో తమ్ముళ్ల దౌర్జన్యం
రాయదుర్గం టౌన్: రాయదుర్గంలో ‘తమ్ముళ్లు’ దౌర్జన్యానికి దిగారు. 31, 32 వార్డుల్లో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు భళే శంకర్, తిప్పేస్వామి, ఎల్లప్ప, రాజశేఖర్ తదితరులు అడ్డుకుని నాయకులతో వాదనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులు దీటుగా జవాబివ్వడంతో నీళ్లు నమిలారు. టీడీపీ నాయకుల తీరుపై స్థానికులు విస్తుపోయారు. ఈ విషయంపై చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప మాట్లాడుతూ తమ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకోవడంతోపాటు పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నామన్నారు. అలాంటి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికీ నీచ సంస్కృతి అని, ఒకవేళ ప్రభుత్వం మంచి చేస్తుంటే టీడీపీ నాయకులకు అంత ఉలుకెందుకుని ప్రశ్నించారు.
నిలకడగా శైలజనాథ్ ఆరోగ్యం
శింగనమల: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం కొద్ది మేర కోలుకున్నారు. అయితే పూర్తిగా కోలుకునే వరకూ ఆస్పత్రిలోనే ఉంచనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, మూడు రోజులుగా తనపై నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు చూపిన ప్రేమానురాగాలకు శైలజనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
బొగ్గు అక్రమ రవాణాపై నివేదిక పంపండి!
బొగ్గు అక్రమ రవాణాపై నివేదిక పంపండి!