
మార్కు కోల్పోవాల్సిందేనా?
● మెగా డీఎస్సీ ఎస్జీటీ పరీక్షలో ఓ ప్రశ్నకు తప్పు సమాధానం
● అభ్యంతరం తెలిపినా
పరిష్కరించలేదంటున్న అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ ఎస్జీటీ పరీక్షలో ఓ ప్రశ్న తప్పుగా ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఫైనల్ ‘కీ’ కూడా విడుదల చేశారు. ఈ ‘కీ’ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఏంటా ప్రశ్న...?
ఎస్జీటీ పరీక్షల్లో భాగంగా జూలై 2న మధ్యాహ్నం జరిగిన పరీక్షలో 41వ ప్రశ్నగా ‘తిక్కనకు సంబంధించి కింది వాటిలో సరికానిది’ అని అడిగారు. సమాధానాలు.. ‘అ–మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు, ఆ–నిర్వచనోత్తర రామాయణం వీరి రచన, ఇ–మహాభారతంలో అరణ్యపర్వం నుంచి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు. ఈ–నాటకీయత వీరి కవితా లక్షణం’ అని ఇచ్చారు. కీలో సమాధానం ‘అ,ఆ,ఈ’ అని ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులు చెబుతున్నారు. 8వ తరగతి తెలుగువాచకం 146వ పేజీలో ‘ఆతిథ్యం’ అనే పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉండడం గమనార్హం. తిక్కన ‘మనుమసిద్ది ఆస్థానంలో మంత్రిగా పని చేశారు, నిర్వచనోత్తర రామాయణం రచించారు, ఈయన శైలి నాటకీయం’ అని ఆ పాఠంలో స్పష్టంగా ఉంది. అంటే ఈ ప్రశ్న ‘తిక్కనకు సంబంధించి కింది వానిలో సరైనది’ అని అడిగిఉంటే వారు ఇచ్చిన సమాధానం సరిపోయేది. వారు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్లలో లేనేలేదు. దీనిపై ఆధారాలతో సహా అభ్యంతరాలు తెలిపినా అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్ కీ విడుదల చేశారు. ఈ క్రమంలో తాము అరమార్కు నష్టపోవాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. అరమార్కుతోనే వందలాది మంది అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయంటున్నారు. ప్రశ్నకు సమాధానం తెలీక... అదృష్టం కొద్దీ ‘అ,ఆ,ఈ’ సమాధానం ఇచ్చిన వారికి మార్కు వస్తుంది. అలాకాకుండా ఏళ్ల తరబడి రేయింబవళ్లు చదువుకుని పూర్తిగా అవగాహన ఉండి తప్పుగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం పెట్టలేని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రశ్నకు మార్కు యాడ్ చేయాలని కోరుతున్నారు.