
ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు
బ్రహ్మసముద్రం: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తమకొద్దు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ముక్తకంఠంతో నినదించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం మేరకు... బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆర్. వేమనారాయణ విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బాలికలపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడేందుకంటూ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఇవ్వమంటున్నారు.ఇవ్వకపోతే ఇష్టమొచ్చినట్లు కొడుతునారు. ఇటీవల విద్యార్థులు తిరగబడడంతో మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయిన ఆయన.. రెండు రోజుల క్రితం తిరిగి విధులకు హాజరయ్యారు. కానీ, పాత బుద్ధి మాత్రం పోనిచ్చుకోకుండా విద్యార్థినులతో మళ్లీ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. శనివారం వారు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు వేమనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌ఎం సుహాసినికి వినతి పత్రం అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
గుండిగానిపల్లి తెలుగు టీచర్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు