
జిల్లా అంతటా శనివారం పగటి ఉష్ణోగ్రతలు పెరగగా, రాత్రి ఉష
కూటమి ప్రభుత్వం
చేసిందేమీ లేదు
● ‘ఫ్యాప్టో’ ధర్నాలో నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్: ‘‘కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చేసిందేమీ లేదు. 11వ పీఆర్‌సీ బకాయిలు, పెండింగ్ డీఏల ఊసే లేదు. 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేయలేదు.కనీసం సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి సమయం కూడా ఇవ్వడం లేదు’’ అంటూ ‘ఫ్యాప్టో’ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిమాండ్ల సాధనకు శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ శ్రీనివాసనాయక్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా పీఆర్‌సీ ఉసేలేదన్నారు. 12వ వేతన సవరణ సంఘం అమలు గడువు ఆలస్యమైనందున వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మూడు డీఏలను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని, ఇప్పటికే మంజూరైన డీఏ బకాయిలు, 11వ పీఆర్‌సీ బకాయిలూ చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2004 సెప్టెంబరు 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో 57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులపై పీ–4 కార్యక్రమం బలవంతంగా రుద్దడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాకు వైఎస్సార్‌టీయూ నాయకులు నాగిరెడ్డి, శ్రీధర్‌గౌడ్, ఎంఈఓ–2 సంఘం నాయకులు రామచంద్ర, పీడీ సంఘం అక్కులప్ప తదితరులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ‘ఫ్యాప్టో’ కో–చైర్మన్లు ఓబుళేసు, లింగమూర్తి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు రమాణారెడ్డి, వెంకటేష్, కార్యదర్శి రత్నం, కోశాధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.