
రేపు, ఎల్లుండి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్:అనంతపురం,శ్రీ సత్యసాయి జిల్లాల్లో సోమ,మంగళ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం కూడా వర్షం పడవచ్చన్నారు. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు.
పంటల బీమా గడువు పెంపు
అనంతపురం సెంట్రల్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ పంటల బీమా(ఆర్‌డబ్లూబీసీఐఎస్) గడువును ఈనెల 14 వరకూ పొడిగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉమా మహేశ్వరమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా గడువు పొడిగించినట్లు వివరించారు. జూలై 31తో గడువు ముగిసిందన్నారు. అయితే జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వలన వివిధ పంటల సాగుకు ఇంకా సమయం ఉందని, దీని దృష్టిలో పెట్టుకొని గడువు పెంచాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో బీమా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. రుణం తీసుకోని రైతులకు ఈనెల 14 వరకూ, రుణం తీసుకున్న వారికి ఈనెలాఖరు వరకూ అవకాశం కల్పించారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేపు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలిపారు.