
●కసాపురం.. భక్తజనసాగరం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఆంజనేయస్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి.సీతారామలక్ష్మణులు హనుమంత వాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శనివారం వేకువజామునే నెట్టికంటుడికి మహాభిషేకాలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని వజ్రకవచ అలంకరణలో తీర్చిదిద్దారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు బెల్డోణ సత్రంలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం సీతారామలక్ష్మణులను హనుమంత వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకీలో ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కే.వాణి, ఏఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.