
రాయలచెరువులో ప్రజలతో మాట్లాడుతున్న సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ
యాడికి: మద్యం ప్రభావం లేని ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. యాడికి మండలంలోని 14 పంచాయతీల్లో గుర్తించిన సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ స్టేషన్లు, పోలీసు పికెట్లను శుక్రవారం సీఐ నాగార్జునరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. యాడికి, కోనుప్పలపాడు, గుడిపాడు, నిట్టూరు, వేములపాడు, వెంగన్నపల్లె, రాయలచెరువు, చందన, లక్షుంపల్లి గ్రామాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులపై స్థానికులతో ఆరా తీశారు. గ్రామాల్లో మద్యం నిల్వలు ఉంటే సెబ్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామ న్నారు. అల్లర్లు, గొడవలు జరగకుండా చూడాలని సీఐకు సూచించారు. పోలింగ్ బూత్‌లను సందర్శించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వెంగన్నపల్లె, కోనుప్పలపాడులోని పోలీస్ పికెట్లను తనిఖీ చేశారు.
వైఎస్సార్‌సీపీతోనే
బడుగుల అభ్యున్నతి
పామిడి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే బడుగులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ అన్నారు. శుక్రవారం పామిడికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీల పక్షపాతిగా పేర్కొంటూ అధికారం దక్కించుకున్న నారా చంద్రబాబు వాస్తవానికి బీసీలకు చేసిన మేలు ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యునతికి పాటుపడింది కేవలం సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. గుర్తింపు లేనివాళ్లకు సైతం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రపీఠం వేసిన మహానుభావుడు సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘ సంస్కర్తగా చూడాలని, విప్లవాత్మక నిర్ణయాలతో సమ సమాజ స్థాపన నెలకొల్పే దిశగా పాలన అందించిన ఆయనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌కిరణ్