కశింకోట: మండలంలోని పల్లపు సోమవరం గ్రామం వద్ద పశువులు మేపడానికి వెళ్లి ఒకరు నదిలో మునిగి మృతి చెందినట్లు సీఐ అల్లు స్వామినాయుడు మంగళవారం రాత్రి తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన వజ్రపు రామకృష్ణ(41) పశువులు మేపడానికి సమీపంలోని తమ పొలానికి సోమవారం తీసుకెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. అచూకీ కానరాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తమ పొలాల సమీపంలోని శారదా నదిలో మృతదేహం లభ్యమైంది. దీంతో పశువులు మేపడానికి వెళ్లిన సమయంలో బహిర్భూమికి నది వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో జారి పడిపోయి మృతి చెంది ఉండవచ్చునని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లభ్యమైన మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. మహిళా ఏఎస్ఐ ఎన్. మణికుమారి కేసు దర్యాప్తు చేపట్టారన్నారు.


