కుంగిన కల్వర్టులు, మదుంలు | - | Sakshi
Sakshi News home page

కుంగిన కల్వర్టులు, మదుంలు

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

బీఎన్‌, కేబీ రోడ్లలో తరచూ ప్రమాదాలు

ప్రమాదకర కల్వర్టులపై ఆగని గ్రానైట్‌, క్వారీ లారీల రాకపోకలు

భయాందోళనలో ప్రయాణికులు

బుచ్చెయ్యపేట: అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు లేని రోడ్లు చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు రెండున్నరేళ్ల పాలనలో వాటి అతీగతీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవే రహదారుల్లో ఉన్న కల్వర్టులు, మదుములు పలుచోట్ల కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. ఇవి ఏక్షణంలోనైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే భీమునిపట్నం – నర్సీపట్నం(బీఎన్‌) రోడ్డు, కశింకోట – బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

బీఎన్‌ రోడ్డులో లోపూడి డాల్పిన్‌ సెంటర్‌ వద్ద కల్వర్టు కూలి పెద్ద గొయ్యిలా తయారైంది. ఇదే రహదారిలో శింగవరం హెరిటేజ్‌ సెంటర్‌ వద్ద మదుం కూలిపోయింది. అయినప్పటికీ రాత్రిపూట 40 నుంచి 60 టన్నుల బరువున్న గ్రానైట్‌, క్వారీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో కల్వర్టు, మదుం రోజురోజుకు కిందకు కూరుకుపోయి పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. గతేడాది కురిసిన వర్షాలకు లోపూడి డాల్పిన్‌ వద్ద కల్వర్టు కూలిపోగా ఆర్‌అండ్‌బీ అధికారులు మట్టితో పూడ్చి వదిలేశారు. ఈ కల్వర్టుకు రెండు వైపులా కూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట వేగంగా వస్తున్న వాహనదారులు చీకట్లో రంధ్రం పడినట్లు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏ క్షణంలోనైనా ఈ కల్వర్టు కిందకి కూలిపోయేలా ఉంది. ఈ కల్వర్టు కూలిపోతే నర్సీపట్నం, చోడవరం, పాడేరు నుంచి రాజమండ్రి, కాకినాడకు, విశాఖ నుంచి కొత్తకోటకు తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.

రాత్రిపూట కనిపించక ప్రమాదాలు

కేబీ రోడ్డులో కందిపూడి, రాజాం వెదుళ్లగడ్డ వంతెనల మధ్య మదుంకు గొయ్యి పడింది. బీఎన్‌ రోడ్డు శిథిలావస్థకు చేరి పెద్దపెద్ద గోతులు పడటంతో పాడేరు, మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట, చీడికాడ, కశింకోట తదితర మండలాల వాహనదారులంతా కేబీ రోడ్డులో నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కేబీ రోడ్డులో మదుం మధ్యలో రంధ్రం కనిపించక వేగంగా వస్తున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. భారీ వాహనాలు రాకపోకలతో కల్వర్టు పూర్తిగా కూలిపోయేలా ఉంది. కూలిన కల్వర్టు, గోతులు రాత్రిపూట కనిపించక పలువురు ప్రమాదాల బారినపడుతున్నారు. కూలిన రెండు కల్వర్టుల వద్ద ప్రమాదాలు జరగకుండా యువకులు హెచ్చరికగా కర్రలు ఏర్పాటు చేశారు. కేబీ రోడ్డులో మరికొన్ని మదుంలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. తక్షణం ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే కుంగిన కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. రెండు రహదారుల్లో రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా కల్వర్టు నిర్మాణంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement