మిట్టల్‌ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మిట్టల్‌ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

అనకాపల్లి : ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా ప్రతిపాదించిన గ్రీన్‌ ఫీల్డ్‌ క్యాప్టివ్‌ పోర్టు ప్రాంతంలో పర్యటించిన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, మత్స్యకారుల జీవనోపాధిని కూటమి ప్రభుత్వం దెబ్బతీయడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం పోరాడడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యతని, అలాంటి హక్కులను పోలీసుల ద్వారా అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఈ నెల 15న జరగనున్న మిట్టల్‌ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుసుకోవడం తప్ప, పోలీసుల నిర్బంధాల మధ్య తూతూ మంత్రంగా నిర్వహించడం కాదన్నారు. గతంలో నాతవరం ప్రాంతంలో లేటరైట్‌ తవ్వకాల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గిరిజన గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టి ప్రజలను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజల గొంతును వినాల్సిన పాలకులు, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడడం సరికాదని, జిల్లాలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మిట్టల్‌ పోర్టు నిర్మాణంతో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. పోర్టు ప్రాంత పర్యటనలో మత్స్యకారుల జీవనోపాధి, చేపల వేటకు ఎదురయ్యే ఇబ్బందులు, తీరప్రాంత పర్యావరణంపై పడే ప్రభావాల గురించి తెలుసుకోవడానికి సీపీఎం బృందం పర్యటిస్తే పోలీసులతో అడ్డుకోవడం అన్యాయమన్నారు. గతంలో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ఇచ్చిన హామీల్లో అనేకం అమలు కాకపోవడమే కాకుండా, ఇప్పుడు మరో ప్రాజెక్టుతో ప్రజలకు కొత్త సమస్యలు సృష్టించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నిర్బంధం అక్రమం : అప్పలరాజు

ఎస్‌.రాయవరం: నక్కపల్లి మండలం డీఎల్‌పురం గ్రామం వద్ద ఈ నెల 15న నిర్వహించి తలపెట్టిన ఆర్సిలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ క్యాప్టివ్‌ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని కోరుతూ మత్స్యకారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజును ధర్మవరం అగ్రహారంలో గృహనిర్బంధంలో ఉంచారు. ఎస్‌.రాయవరం పోలీసులు మంగళవారం అప్పలరాజును ఇంటి నుంచి కదలకుండా ఇరువురు పోలీసులు కాపలా కాశారు. అప్పలరాజు మాట్లాడుతూ ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతునొక్కే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement