నర్సీపట్నం : రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, చంద్రబాబునాయుడు బీసీ రిజర్వేషన్లపై ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇదే అంశంపై 2024 ఆగస్టు 28న చంద్రబాబు జీవో నంబర్ 105 ఇచ్చారని, 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఆ జీవోపై టీడీపీ నాయకులు నానా హంగామా చేశారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 2019 అక్టోబర్ 28న జీవో నంబర్ 176 ద్వారా ఏడేళ్ల క్రితమే ఇచ్చారని, దీనిపై టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్తే కోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం కన్నా ఎక్కువ అవకాశాలు కల్పించేలా సంకల్పం తీసు కున్నారని, కానీ చంద్రబాబు బీసీలను మోసం చేసేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు రద్దు చేసినప్పటికీ, నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో(గ్రామ పంచాయ తీల, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు) 34 శాతానికి పైగా అవకాశాలు కల్పించి అమలు చేసి చూపించిందన్నారు. టీడీపీ నాయకులకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలని, కేవలం రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఎన్నికల ముందు బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. బీసీ రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్, ప్రత్యేక బ్యాంక్, నిరుద్యోగ భృతి వంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీసీలు మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే చట్ట సవరణ చేసి 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతి బీసీ కూడా వీరికి తగిన బుద్ధి చెబుతా రని హెచ్చరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తమరాన శ్రీను, పట్టణ ఉపాధ్యక్షు లు సుర్ల నాయుడు తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్


