నర్సీపట్నం : పట్టణంలో శివపురంలో నూతనంగా నిర్మించిన శ్రీలలిత హాస్పిటల్‌ను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో ఆర్థోఅండ్ స్పోర్ట్స్ కేర్‌తో పాటు ప్రత్యేకంగా స్కిన్ మంత్ర విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన గణనీయంగా పెరిగిందన్నారు. మందులతో పనిలేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయా న్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. గతంలో మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు నర్సీపట్నంలో సుమారు 40కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజ లు సుదూర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలు పొందవచ్చున్నారు. అనంతరం ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సూర్య నారాయణ, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ హనుతేజ స్పీకర్, సతీమణి పద్మావతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


