గెడ్డ భూముల కబ్జాకు స్కెచ్‌ ! | - | Sakshi
Sakshi News home page

గెడ్డ భూముల కబ్జాకు స్కెచ్‌ !

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

రూ.32 కోట్ల విలువైన గెడ్డ పోరంబోకు భూమికి రెక్కలు?

కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలోని ప్రభుత్వ భూమికి రక్షణ కరువు

రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి కనుసన్నల్లోనే అక్రమాల పర్వం

మూడు దశాబ్ధాల క్రితం ఆ భూముల్లో వేసిన యూకలిప్టస్‌ తోటలు నరికివేత

పట్టించుకోని అధికార యంత్రాంగం

సాక్షి, అనకాపల్లి : రెవెన్యూలో అధికారిగా పనిచేసి రిటైరైన వ్యక్తి కనుసన్నల్లో రూ. 32 కోట్ల విలువైన గెడ్డ పోరంబోకు భూమిపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 22ఏ మినహాయింపు ఉత్తర్వుల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ యాభై లక్షల రూపాయల విలువైన పంట ఫలాన్ని, 32 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని కొట్టేసే బలమైన స్కెచ్‌కు బీజం పడింది. జిల్లా కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఈ గెడ్డ పోరంబోకు విషయంలో అధికారుల వింత వైఖరి సైతం అక్రమార్కులకు అనుకూలంగా మారుతోంది. వివరాల్లోకి వెళితే...

గోపాలపురం శివారు గ్రామంలో ...

అనకాపల్లి మండలంలోని గోపాలపురం గ్రామ శివారున ఉన్న వెంకటరమణ పేట పరిధిలో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో గెడ్డ పోరంబోకు ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతానికి సమీపంలోని ఉన్న కొండల నుంచి వచ్చే వర్షపు నీరు గతంలో లోతట్టు ప్రాంతంగా ఉండే భూమిలో ఇంకేది. కాలానుగుణంగా పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్ల కారణంగా గెడ్డలు, కాలువలు, చెరువులు క్రమక్రమంగా ఆక్రమణకు గురయ్యాయి. మూడు నాలుగు దశాబ్ధాల క్రితమే ఈ గెడ్డ పోరంబోకు భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు యూకలిప్టస్‌ తోటలు వేశారు. నీటి పారుదల శాఖకు బదలాయించాల్సిన ఈ భూముల్ని రెవెన్యూ అధికారులు నిర్లిప్తత ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఏ ప్రకారం గెడ్డ పోరంబోకుగా ఉన్న ఈ భూముల్లో యూకలిప్టస్‌ తోటలు పెంచడాన్ని అడ్డుకోని రెవెన్యూ శాఖ ఇప్పుడు ఆక్రమణదారులకు అండగా మారే పనిలో పడింది. దీనికి రిటైరయిన మాజీ రెవెన్యూ అధికారి ప్రణాళిక రూపొందించినట్టు బాహాటంగా చెప్పుకుంటున్నారు.

యూకలిప్టస్‌ చెట్ల నరికివేత

కొద్ది రోజుల నుంచి 16 ఎకరాల్లో సాగవుతున్న యూకలిప్టస్‌ చెట్లను నరికివేసి తరలిస్తున్నారు. ఈ చెట్ల విలువ కనీసం యాభై లక్షల రూపాయల వరకూ ఉంటుందని సమాచారం. దీనిపై ఆరోపణలు వినవస్తున్నా, పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి గానూ రెవెన్యూ అధికారులు చెబుతున్న వివరణ ఆసక్తికరంగా ఉంది. రాంబిల్లి మండలంలోని ఏపీఐఐసీ సేకరిస్తున్న భూములకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడంతో ఇంకా వెంకటరమణపేట భూముల్ని పరిశీలించలేదని చెబుతున్నారు. సదరు భూముల్లో ఆక్రమణదారులు ఉన్నారని, వారిని తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిచామని రెవెన్యూ శాఖ చెబుతోంది. అయితే ముందు గెడ్డపోరంబోకు భూమిలో ఉన్న యూకలిప్టస్‌ తోటలు ఎవరు వేశారు..? నీటి వనరైన ఆ భూముల్లోకి ఆక్రమణ దారులు ఎలా వచ్చారు..? సుప్రీంకోర్టు నిబంధనల మేరకు గెడ్డపోరంబోకు భూములను కాపాడాల్సిన బాధ్యత ఎందుకు విస్మరించారు.. రెవెన్యూ శాఖ ఆ భూముల్ని నీటి పారుదల శాఖకు ఎందుకు బదలాయించలేదు..? అనే అంశాలపై దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నారు.

స్వాధీనం చేసుకుంటాం

అనకాపల్లి మండలంలోని వెంకటరమణ పేటలో సర్వే నంబర్‌ 107లో ఎస్‌ఎఫ్‌ఏ ప్రకారం 16 ఎకరాలు ఉంది. దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది అయిన వీఆర్‌ఓతో పాటు స్థానిక సమాచారం మేరకు ఆక్రమణదారులు ఉన్నారని చెబుతున్నారు. వారి వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను తీసుకురమ్మన్నాం. ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని, ఫెన్సింగ్‌ వేస్తాం. ఆక్రమణదారులకు చట్టబద్ధంగా హక్కు ఉంటే దానిని పరిశీలిస్తాం. ప్రభుత్వ భూముల్ని పరిరక్షిస్తాం.

– తహసీల్దార్‌, ఆనంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement