దేవస్థానం రికార్డుల్లో 108 ఎకరాలు
రెవెన్యూ రికార్డుల్లో 53 ఎకరాలు
సర్వే కొలతల్లో 46 ఎకరాలు
వేంకటేశ్వరస్వామి ఆస్తుల్లో బయట పడని అసలు నిజాలు
వందేళ్లుగా సాగు చేసుకుంటున్న
65 మంది రైతులకు జరగని న్యాయం
దేవుడి మాన్యం రికార్డుల నుండి విముక్తి కలిగించాలని కోరుతున్న రైతులు
నేడు దేవస్థానం, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే
బుచ్చెయ్యపేట : వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆస్తులను అటు దేవస్థానం, ఇటు రెవెన్యూ అధికారులు తేటతెల్లం చేయలేకపోతున్నారు. ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే స్వామి వారి ఐదు రోజుల కల్యాణానికి ఉత్తరాంధ్ర నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. సుమారు 153 ఏళ్ల చరిత్ర ఉన్న వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దొండా భగవంతులయ్య కుటుంబ సభ్యులు నిర్మించారు. అప్పట్లో స్వామి ధూపదీప నైవేద్యాల కోసం 1938లో సర్వే నెంబర్ 293–5లో 105 ఎకరాలు భూమిని దేవుడికి రాసి ఇచ్చినట్లు దేవస్థానం రికార్డుల్లో ఉంది. తరవాత 1995 ప్రాంతంలో రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వేంకటేశ్వరస్వామికి సర్వే నెంబర్ 176–5ఎలో 53 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు నమోదు చేశారు. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న భూ సమగ్ర సర్వేలో వేంకటేశ్వరస్వామికి 46 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో భక్తులు అసలు స్వామి వారి ఆస్తులెంత అని అయోమయంలో పడ్డారు. ఇదే గ్రామంలో 65 మంది రైతులు ఆలయ భూములను ఆనుకుని దశాబ్దాల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. రైతుల సాగు భూములను దేవుడి మాన్యంగా రికార్డుల్లో తప్పుడుగా నమోదు చేశారు. అత్యవసర సమయంలో భూములు అమ్ముకోవడానికి, బ్యాంకు రుణాలు తెచ్చుకోవడానికి వీలు పడడం లేదని న్యాయం చేయాలని పలుసార్లు రైతులు జిల్లా కలెక్టర్‌కు, మండల తహసీల్దార్ కార్యాలయాలకు కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం జరగ లేదు. అసలు వేంకటేశ్వరస్వామి భూమి ఎక్కడ ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నది దేవస్థానం, రెవెన్యూ అధికారులు నిగ్గు తేల్చడం లేదు. పలువురు రైతులు మా జిరాయితీ భూములను దేవుడి మాన్యం భూముల రికార్డుల నుంచి తొలగించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు నేరుగా కలిసి వేడుకున్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం వడ్డాదిలో స్వామివారి ఆలయ భూములపై సమగ్ర సర్వే చేయానికి చర్యలు చేపట్టారు. దేవస్థానం, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు.
ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి,కలెక్టర్ కార్యాలయం ఏడీ, తహసీల్దార్ లక్ష్మి, ఈవో శర్మ,మండల సర్వేయర్, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, వీఆర్వో, సర్వేయర్ తదితర అధికారుల సమక్షంలో వడ్డాదిలో సర్వే చేయనున్నారు. దీంతో మేజర్ పంచాయతీ వడ్డాదిలో పలువురు రైతులు ఇప్పటికై నా తమకు న్యాయం జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు.


