స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

● రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి ● 6,333 పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

తుమ్మపాల : స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను, నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి గురువారం ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ ఆధ్వర్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి ఆమెతో పాటు ఎస్పీ తుహిన్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ హాజరయ్యారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 9వ జోన్‌ ఉందన్నారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు వరకు చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేసామన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు.

సమస్యాత్మక కేంద్రాల జాబితా సిద్ధం చేయాలి

జిల్లాలోని 6,333 పోలింగ్‌ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లలో పోలింగ్‌ సమయంలో చోటుచేసుకున్న సమస్యలు, ఘర్షణల వివరాలను స్థానిక సీఐలు, ఎంఆర్‌ఓలతో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వర్గీకరణ ఆధారంగా సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, పోలీసు బలగాల మోహరింపుపై పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పవిత్రమైనదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ గత ఎన్నికల పరిస్థితులు ప్రస్తుతం మారినందున ఎస్‌హెచ్‌ఓలతో కలిసి పోలింగ్‌ కేంద్రాలను పునఃపరిశీలించి వర్గీకరించాలని సూచించారు. పరిమితంగా ఉన్న పోలీసు బలగాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు కాంపౌండ్‌ వాల్స్‌ ఉండేలా చూడాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓటర్లకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో సందీప్‌, మున్సిపల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement