చెరబట్టారు.. | - | Sakshi
Sakshi News home page

చెరబట్టారు..

Jul 10 2026 5:46 AM | Updated on Jul 10 2026 5:46 AM

చెరువును

కూటమి నాయకుల బినామీల పేర్లతో నమోదు

చెరువు గర్భంలో ఏర్పాటైన స్టోన్‌ క్రషర్లు

క్షేత్రస్థాయిలో విచారణకు వెనుకాడుతున్న రెవెన్యూ అధికారులు

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటున్న గ్రామస్తులు

కూటమి నాయకులే కబ్జాదారులుగా తయారై చెరువులు, గెడ్డలు, కొండలు ఆక్రమించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెంలో పాత్రుని చెరువు ఆక్రమణపై విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పదే పదే మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు.

తుమ్మపాల : కూటమి ప్రభుత్వంలో చేపట్టే రీ సర్వే కూటమి నాయకులకు కాసులవర్షంగా మారింది. చెరువులు, గెడ్డలను సైతం లెక్కచేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించి బినామీల పేర్లతో మార్చేసుకుంటున్నారు. అధికారం అండతో పెందుర్తిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈనాం చెరువు కబ్జాకు దిగడంతో అదే పార్టీకి చెందిన టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సందర్భం ఏర్పడింది. ఈ ఉదంతం మరువక ముందే అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెంలో కూటమి నాయకులు పాత్రుని చెరువు కబ్జాకు దిగడం మరో వివాదంగా ఏర్పడింది. కూటమి నాయకులే కబ్జాదారులుగా తయారై చెరువుల, గెడ్డలు, కొండలు ఆక్రమించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దొరికింది దోచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గ్రామాల్లో చేపడుతున్న రీసర్వేలో కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు కూడా అండగా నిలవడంతో ప్రభుత్వ ఆస్తులను సైతం కొల్లగొట్టేస్తున్నారు.

అనకాపల్లి మండలం రేబాక రెవెన్యూ పరిధి కాపుశెట్టివానిపాలెంలో సర్వే నెం.243లో 13.70 ఎకరాల పాత్రుని చెరువు ఉంది. పురాతన కట్టడాలతో సాగునీటి కాలువల మదుములు, రాతికట్టు గట్లు, ప్రభుత్వ నిధులతో చేపట్టి పనులతో ప్రభుత్వ రికార్డుల్లో పాత్రుని చెరువుగా స్పష్టంగా మ్యాప్‌ ఉంది. ఈ చెరువు ఆధారంగా దాదాపు 150 ఎకరాల ఆయకట్టు భూమిలో రైతులు వరితో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, చెరువు ఆనుకుని స్టోన్‌ క్రషర్లు కలిగిన టీడీపీ మాజీ కార్పొరేటర్‌ మాధంశెట్టి నీలబాబు, టీడీపీ నాయకులు పోల్నాటి అప్పారావు, గొట్టిపాటి సుధాకర్‌ చౌదరిల కన్ను ఈ చెరువుపై పడడంతో రేబాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మామిడి చిన్నారావు చెరువు పూర్వ రికార్డుల ఆధారంగా బినామీ రిజిస్ట్రేషన్లు చేయించి 2016 ఏడాదిలోనే స్టోన్‌ క్రషర్ల యాజమానుల పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో ఆన్‌లైన్‌ చేసేసారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.2 కోట్ల వరకు చేతులు మారినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి క్రమంగా స్టోన్‌క్రషర్లను చెరువు గర్భంలో నిర్మించి కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇప్పుడు పూర్తిగా చెరువు రూపురేఖలే మార్చేసి దోచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా రీసర్వే..

ప్రస్తుతం ఈ చెరువు మార్కెట్‌ విలువ దాదాపు రూ.25 కోట్ల వరకు పెరగడంతో చెరువు రికార్డును రీసర్వేతో మరింత దృఢపరిచే పనిలో భాగంగానే గత నెల 29న గుట్టుచప్పుడు కాకుండా రీసర్వే బృందంతో చెరువులోకి అక్రమంగా ప్రవేశించి సర్వే పనులు ప్రారంభించారు. ఇది గమనించిన రైతులు, గ్రామస్తుల సహకారంతో రీ సర్వేను అడ్డుకోవడం, ఆక్రమణకు ప్రయత్నించిన కూటమి నాయకులను నిర్బంధించినప్పటికి పోలీసులు ఆక్రమణదారులకే కొమ్ము కాసి, అక్కడ నుంచి క్షేమంగా బయటకు పంపించేశారు. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు చేసిన ఫిర్యాదులను పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని కనీసం పట్టించుకున్న దాఖలాలు నేటికీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

క్షేత్ర స్థాయి విచారణకు గ్రామస్తుల డిమాండ్‌

నీటి నిల్వను కలిగి ఒక ప్రాంతానికి జలాధారంగా ఉన్న చెరువులను కాపాడుకోవడం రెవెన్యూ అధికారుల ప్రధాన విధి. కానీ పాత్రుని చెరువు వివాదంలో రెవెన్యూ అధికారులు కనీసం స్పందించకపోవడం పలు అనుమానాలకు చోటిస్తుంది. చెరువు రికార్డులను గతంలోనే తారుమారు చేసినప్పటికీ రీసర్వేను ఆసరాగా చేసుకుని కబ్జాదారులు చేపట్టిన ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన పది రోజులుగా గ్రామస్తులు, రైతులు కలెక్టర్‌తో పాటు రెవెన్యూ డివిజనల్‌ అధికారి, మండల తహసీల్దార్‌, స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. పలు రకాల ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నప్పటికీ అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడం గ్రామస్తులను నిరాశకు గురిచేస్తుంది. రెవెన్యూ అధికారుల అండతో చెరువులను కబ్జా చేస్తున్న కూటమి నాయకులపై తక్షణమే విచారణ ప్రారంభించాలని, చెరువు రిజిస్ట్రేషన్లతో జరిగిన రూ.2 కోట్ల లావాదేవీలపై కూపి లాగి న్యాయపరమైన చర్యలతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement