మహారాణిపేట : గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఇల్లు, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరుతూ బాధిత కుటుంబాలు గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాయి. కలెక్టర్‌ను కలిసే వరకు వెళ్లబోమంటూ ఆయన చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఏపీ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం. సుబ్బారావు మాట్లాడుతూ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారం సరిపోదని, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఇల్లు, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం, పిల్లల విద్య బాధ్యతను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో బోటు కోల్పోయిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడం ఆందోళనకరమని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందడం లేదని విమర్శించారు. గతంలో మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారి సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. మరో 15 రోజుల్లో మళ్లీ కలెక్టర్‌ను కలిసి సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.
గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు
రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్


