మహిళా దినోత్సవ సత్కార సభలో ప్రోటోకాల్ పాటించని అధికారులు
కార్యక్రమాన్ని బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు
కూటమి నేతలు, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన
నాతవరం: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఏర్పాటు చేసిన సత్కార సభలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగింది. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం గొలుగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీగౌరీ ఆధ్వర్యంలో మహిళా ఎంపీటీసీ, సర్పంచులకు సత్కార సభ ఏర్పాటు చేశారు. కూటమి నేతలు సొంత పార్టీ కార్యక్రమం మాదిరిగా సభను నడిపారు. జెడ్పీటీసీ అప్పలనర్స, సర్పంచ్ రాణిలను ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ముందుగా ఆహ్వానించకుండా కూటమి నేతలకు పెద్ద పీట వేశారు. ముందు వరుస సీట్లో కూటమి నేతలు కూర్చోగా చివరిలో ఆహ్వానించి, వేదికపై ఓ మూలన సీట్లు వేశారు. కూటమి నేతలు... వైఎస్సార్‌సీపీ నేతలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నా వేదికపై ఉన్న ఐసీడీఎస్ అధికారులు కనీసం పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయి వారికివత్తాసు పలికారని ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు చెందని జెడ్పీటీసీ సభ్యురాలు అప్పలనర్స, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు, అధికారులు కుమ్మకై ప్రోటోకాల్ ప్రకారం తమకు కనీస గౌరవ ఇవ్వకపోవడం దారుణమన్నారు. పదవులు లేని కూటమి నేతలను వేదికపై కూర్చోబెట్టి తమను అవమాన పరిచారంటూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. జెడ్పీటీసీతో పాటు నాతవరం సర్పంచ్‌రాణి, ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం మండల శాఖ అధ్యక్షురాలు ఇనపసప్పల పుష్ప, గుమ్మడిగొండ, నాతవరం ఎంపీటీసీ సభ్యులు సుర్ల పాప, చెక్కా ప్రభావతి, పెదగొలుగొండపేట ఎంపీటీసీ సభ్యుడు తమరాన సత్యనారాయణ, సర్పంచులు పంచాడ పాప, కాళ్ల ఝాన్సీ, మార్తి నాగమణి ,గొర్లె సత్యవేణి, కోసూరి విజయ, జి.వి.రెడ్డి, సోమన్నదొరతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు సత్కార సభను బహిష్కరించారు. కొద్దిసేపటి తరువాత ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి కూడా బయటకు వచ్చేశారు. అనంతరం కూటమి నేతలు, ఐసీడీఎస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా వెలుగు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు అప్పలనర్స, సర్పంచ్ రాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో, స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలోని నాతవరం మండలంలో గిరిజన, దళిత ప్రజాప్రతినిధులకు అడుగడుగునా తీవ్ర అవమానాలు జరుగుతున్నాయన్నారు. మహిళా దినోత్సవ సభకు ఆహ్వానించి, తనకు, సర్పంచ్‌కు కనీస మర్యాద ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు బయటకు వెళ్లిపోవడంతో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులను కూటమి నేతలు సత్కరించారు. అనంతరం ఐసీడీఏస్ ప్రాజెక్టు అధికారి శ్రీగౌరి, సూపర్‌వైజర్లు, ఎంపీడీవో కార్యాలయంలోఉన్న జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల వద్దకు వెళ్లి పొరపాటు జరిగిందని, మళ్లీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని ప్రాధేయపడ్డారు. అయినా సత్కార సభకు వైఎస్సార్‌సీపీకి చెందిన వారు హాజరుకాలేదు.


