చీడికాడ: మా భూముల జోలికి వస్తే సహించేది లేదని మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. సోలార్ ప్రాజెక్టుకు పొలాలను అప్పగించే ప్రసక్తే లేదన్నారు. మండలంలోని బైలపూడి, ఎ.అగ్రహారం పరిసరాల్లో 120 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూముల సేకరణకు ఇటీవల రెండు గ్రామాల్లో తహసీల్దార్ కిషోర్ లింకన్ గ్రామసభలు నిర్వహించారు. తమ సాగులో ఉన్న ఢీపారం భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఆ భూముల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకరించబోమని రెండు గ్రామాల రైతులు తెల్చిచెప్పారు.దీనిపై ఇప్పటికే పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాలు అందజేశారు. అయితే మరోమారు మండల సర్వేయర్ సురేష్‌కుమార్,ఆర్‌ఐ కృష్ణ,సచివాలయం సర్వేయర్‌తో పాటు వీఆర్‌వో సత్యానారాయణ, ఇతర రెవెన్యూ సిబ్బంది ఆ రెండు గ్రామాల్లో భూముల్లో గల పంటలను సర్వే జరిపేందుకు వచ్చారు.దీంతో ఆ గ్రామాల రైతులు సిబ్బందిని అడ్డుకున్నారు.సోలార్ ప్రాజెక్టు మా భూముల్లోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులుంటే చూపించాలంటూ నిలదీశారు. దీనిపై మండల సర్వేయర్,ఆర్‌ఐ,వీఆర్‌వో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ భూముల్లో ఏఏ పంటలు ఉన్నాయో సర్వే జరిపేందుకు వచ్చామన్నారు. సర్వే జరపవద్దని, మా భూములను సోలార్ ప్రాజెక్టుకు ఇవ్వబోమని రైతులు మరోమారు చెప్పడంతో సిబ్బంది వెనుదిరిగారు.మా భూముల జోలికి వస్తే కుటుంబాలతో సహా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.


