పెదపూడిలో నూకాంబిక పండగకు
బుచ్చెయ్యపేట : మండలంలో గల పెదపూడి నూకాలతల్లి పండగకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమారు. నూకాంబిక అమ్మవారికి వందేళ్లుగా వంశపారం పర్యంగా వస్తున్న పూజలు, ఆచారాలను తప్పించి ఈ ఏడాది కూటమి నేతల కమిటీతో అమ్మవారికి పండగ జరిగేలా చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. గ్రామానికి చెందిన గోకివాడ అప్పలస్వామి నాయుడు వంశీయులు ఆధ్వర్యంలో వందేళ్లుగా నూకాంబిక అమ్మవారికి గ్రామంలో పూజలు చేస్తున్నారు. ఇతని వారసులు వీరుబాబు, రామునాయుడు, రాములోడు వీరంతా అప్పటి నుంచి వంశపారంపర్యంగా ప్రతి ఏటా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. గతంలో వీరంతా అప్పటి గ్రామ అధికారి మున్సిబు పోతురాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు చేసేవారు. గోకివాడ కుటుంబానికి చెందిన దాసుడు ఇతని కుమారులు గోకివాడ దేముడు 30 ఏళ్లు, రామనాయుడు గత పదేళ్లుగా నూకాలతల్లి అమ్మవారికి కొత్త అమావాస్య రోజున, ఇతర రోజుల్లో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. 2002లో పెదపూడి నూకాంబిక ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్(దేవదాయశాఖ)లో కలిపారు. అమ్మవారి ఆలయానికి ఆదాయం రావడం లేదని వంశపారం పర్యంగా నూకాంబిక ఉత్సవాలు చేసుకోవాలని దేవస్థానం అధికారులు ఆలయం నిర్మించిన గోకివాడ కుటుంబ సభ్యులకు తెలిపారు. 25 ఏళ్లుగా ఆలయం కట్టించిన గోకివాడ కుటుంబ సభ్యులే అమ్మవారికి ప్రతి ఏటా కొత్త అమావాస్య పండగ నిర్వహిస్తున్నారు. గతంలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది ఎమ్మెల్యే పెదపూడి నూకాంబిక ఆలయ ఉత్సవాలకు కమిటీ వేయడంపై గ్రామస్తులు, ఆలయ వంశపారంపర్య కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది లక్షలాది రూపాయలతో నూకాంబిక అమ్మవారి పండగ చేద్దామని అమ్మవారి ధర్మకర్త మండలి సభ్యులు తగిన చర్యలు చేపట్టారు. ఆలయానికి రంగులు వేసి భారీ విద్యుత్ లైటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర పండగ ఏర్పాట్లు చేసుకున్నారు. నూకాంబిక ఆలయం కట్టించిన గోకివాడ వంశీయులు మంగళవారం రాత్రి గుడిలో పూజలు చేయడానికి వెళ్లగా కూటమి నేతలు పోలీసులతో వీరిని అడ్డగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది కమిటీ సభ్యులతోనే అమ్మవారికి పూజలు, ఉత్సవం చేస్తామని మీరు గుడిలోకి రావొద్దని తెలపడంపై సర్పంచ్ గోకివాడ వరక్రిష్ణ, రమణ, దాసుడు, బండి నాయుడు, వీరునాయుడు, నాగేష్, దేముడు నాయుడు, బొట్టా శివ, వియ్యపు పైడిరాజు, వియ్యపు సోమునాయుడు, రాజబాబు, సాగిరాజు వర్మ , ఎండ్లబోయిన రమణ, పాతరబిల్లి తాతబాబు తదితరులు ఆగ్రహం చెందుతున్నారు. దీనిపై ఇరు వర్గాల వారికి వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలను కాకుండా కమిటీ సభ్యులతోనే ఉత్సవాలు చేయాలని తెలిపారు. దీంతో ఆలయం వద్ద నుంచి ధర్మకర్తల మండలి సభ్యులు వచ్చేశారు. అమ్మవారి ఉత్సవాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని వారిని ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించడంపై వీరు ఆగ్రహం చెందుతున్నారు. నెల రోజుల కిందట వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు ఉత్సవ కమిటీ వేయలేని ఎమ్మెల్యే చిన్న గ్రామంలో నూకాంబిక ఆలయానికి కమిటీ వేయడమేంటని, దేవుడి దగ్గర కూటమి నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని వాపోయారు. ముందుగా స్టేజీ, మైక్ అనుమతి కోరిన ఆలయ ధర్మకర్తలకు అమ్మవారికి ఉత్సవం నిర్వహించే అధికారం లేదని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా గుడి వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడపై గ్రామస్తులు మండిపడుతున్నారు.


