పచ్చనేత మట్టిమేత | - | Sakshi
Sakshi News home page

పచ్చనేత మట్టిమేత

Mar 18 2026 8:11 AM | Updated on Mar 18 2026 8:11 AM

రెచ్చిపోతున్న గ్రావెల్‌ మాఫియా

ఇష్టానుసారం కొండలు తవ్వి మట్టి అమ్మకాలు

జాడలేని మైనింగ్‌ అధికారులు

అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

కోటవురట్ల : అధికారం అండతో టీడీపీ నేతల కాసుల దాహానికి కొండలు పిండవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరుకు చెందిన ఓ టీడీపీ నేత రెండేళ్లుగా కొండలను పిండి చేసి గ్రావెల్‌ మాఫియా నడుపుతున్నాడు. ఇదంతా స్వయానా హోం మినిస్టరు అనిత సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్న మహా దోపిడీ కావడం గమనార్హం. అధికారం అండతోనే సదరు టీడీపీ నేత కొండలను ఇష్టానుసారంగా తవ్వేసి గ్రావెల్‌, రాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. చినబొడ్డేపల్లి రెవెన్యూ పరిధిలోని రెండు కొండలపై ఇతని కన్ను పడి బక్కచిక్కిపోయాయి. కొండలు సగానికి తరిగిపోయినా మైనింగ్‌ శాఖాధికారులు, రెవెన్యూ శాఖాధికారులు నోరుమెదపడం లేదు. చినబొడ్డేపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న నూకాలమ్మకొండ, ఒట్టివోడు కొండలను ఇష్టానుసారం తవ్వేస్తున్నాడు. ఫిర్యాదు వచ్చినపుడు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లేసరికి సదరు మాఫియా డాన్‌ అక్కడి నుంచి పొక్లెయిన్‌, ట్రాక్టర్లను తరలించేస్తున్నాడు. కొండలపై తవ్వకపు జాడలు స్పష్టంగా కనిపించినా ఎవరూ లేరన్న వంకతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్‌ శాఖాధికారుల జాడే లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు వ్యక్తి ఇపుడు మట్టి తరలింపును కూడా వ్యాపారంగా చేసుకున్నాడు. కనిపించిన గ్రావెల్‌, రాయి, మట్టి అప్పనంగా అమ్మేసుకుని రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం గ్రావెల్‌ తవ్వకాలతో పాటు మట్టి వ్యాపారం మూడు గ్రావెల్‌ ట్రాక్టర్లు, ఆరు మట్టి ట్రాక్టర్లుగా వ్యాపారం సాగిస్తున్నాడు. పిప్పళ్ల కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని చెరువును తవ్వేసి స్థానికంగా కొబ్బరితోటలను మెరక చేసే బేరాలు సాగిస్తున్నాడు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినా అధికారులు చోద్యం చూస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

మండలంలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదు. తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే చెరువులో మట్టి తవ్వినా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి అక్రమాలు జరిగితే స్థానికులు సమాచారం ఇవ్వాలి. కొడవటిపూడి సమీపంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రహదారి నిర్మాణానికి కొన్ని ట్రాక్టర్ల గ్రావెల్‌ కోసం మైనింగ్‌ శాఖాధికారులు అనుమతి ఇచ్చారు. కానీ దానికి భారీ స్థాయిలో తవ్వకాలు అవసరం లేదు.

– తిరుమలబాబు, తహసీల్దారు, కోటవురట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement