అధికారులను నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు
రావికమతం : ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు రాకపోయినా మష్టర్‌లు వేసుకోవడం, కొలతల్లో తేడాలు, వీఅర్పీల అవినీతి, గ్రామాల్లో సర్పంచ్‌లకు సమాచారం ఇవ్వకుండా సామాజిక తనిఖీ గ్రామ సభలు పెట్టడం తదితర అంశాలపై స్థానిక మండల పరిషత్ ఆవరణలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ప్రజా ప్రతినిధులు నిలదీశారు. డ్వామా ఇన్‌చార్జి పీడీ రవీంద్ర, అంబుడ్స్‌మెన్ వేణుగోపాలరావు, జిల్లా విజి లెన్స్ అధికారి లలితశ్రీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ దాసు హాజరయ్యారు. మండల పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.212.24 కోట్లతో 1187 పనులు జరిగినట్టు అధికారులు తెలిపారు. 2014–15లో 39 మినీ గోకులం షెడ్ల కోసం రైతులు ఒక్కో షెడ్డుకు రూ.18,500 చొప్పున డీడీలు తీయడం జరిగింది. కట్టిన డీడీలు తాలుకా డబ్బులు ఇప్పటి వరకు రైతులకు తిరిగి అందజేయలేదు. దుర్గా కనస్ట్రక్షన్ వారు కట్టిన డీడీలు మార్చుకుని తీసుకున్నట్టు సమాచారం ఉంది. దీనిపై గతంలో చేపట్టిన సామాజిక తనిఖీల సమయంలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, గోకులం షెడ్డులకు డీడీలుగా కట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గొంప ఎంపీటీసీ సూర్యనారాయణ తెలిపారు. అధికారులు కలగజేసుకొని ఈ విషయంమై జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి పనులపై ఆడిట్ సక్రమంగా జరగలేదని, రీ ఆడిట్ జరిపించి సర్పంచ్ సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలని పండూరి సత్తిబాబు పట్టుబట్టారు. దీనిపై ఉన్నధికారుల దృష్టికి తీసుకెళ్లామని దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికలో చాలా గ్రామాల్లో జరిగిన పనుల్లో కొలతల్లో తేడాలు, కూలీలు పనులకు వెళ్లకుండా మష్టర్లు వేసినట్టు గుర్తించారు. దీనిపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమగ్ర విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.


