నాలుగు సర్వే నంబర్లపై ఫిర్యాదు చేస్తే ఒక్క సర్వే నంబర్‌కే ఎండార్స్‌మెంట్
భూ కబ్జాదారులను రక్షించే ప్రయత్నంలో తహసీల్దార్
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: దేవరాపల్లి రెవెన్యూలో నాలుగు సర్వే నంబర్లలో ఆక్రమణలపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తే ఒక సర్వే నంబర్‌కే ఎండార్స్‌మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను స్థానిక తహసీల్దార్ తప్పుదోవ పట్టించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన తహసీల్దార్ భూ కబ్జాదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 280, 280/1, 281/1, 281/2 లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని గత ఏడాది డిసెంబర్ 8న కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశామన్నారు. ఈ పత్రాలను మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు, సీసీఎల్‌ఏకు పంపించామని చెప్పారు. స్థానిక తహసీల్దార్ దీనిపై విచారణ జరిపి 281/2 లో గల భూమి కోర్టు వివాదంలో ఉందని, ఫల సాయం తీసుకునేందుకు కోర్టు ఆర్డర్ ఉందని, దీనిలో గెస్ట్ హౌస్ నిర్మాణం జరగలేదని ఎండార్స్‌మెంట్‌లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్ 281/2ఏ మాత్రమే కోర్టు వివాదంలో ఉందని, మిగిలిన సర్వే నంబర్లకు కోర్టు వివాదాలు లేవన్నారు. తహసీల్దార్ సర్వే నంబర్ 281/2 కు మాత్రమే ఎండార్స్‌మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని తప్పుడు ఎండార్స్‌మెంట్ ఇచ్చిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు.


