గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలక్ట్రీషియన్ మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వేములవలస ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ ఉప్పాడ అప్పలరాము(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో చనిపోయారు. మృతుడి కుమార్తె భార్గవి ఈ మేరకు ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అప్పలరాము వేములవలస కాలనీ నుంచి జాతీయ రహదారిపైకి నడుచుకుంటూ వస్తుండగా.. గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొని, మోకాలి పైనుంచి దూసుకుపోయింది. తీవ్రమైన గాయాలతో కిందపడి ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి 108 వాహనం సాయంతో కేజీహెచ్‌కు తరలించారు. అయితే గాయాలకు తాళలేక అప్పలరాము చికిత్స పొందుతూ మరణించారు. ఎస్‌ఐ శివ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


