జాతరలో యువకుల దాష్టీకం
● నాగులచవితి రోజు యువకుడిపై విచక్షణారహితంగా దాడి
● 15 రోజులుగా చికిత్స పొందుతూ మృతి
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన
యలమంచిలి రూరల్ : సరదాగా స్నేహితులతో కలిసి జాతర చూసేందుకు వెళ్లిన యువకుడిపై నలుగురు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. గత నెల 25వ తేదీ రాత్రి పంచరాత్రి ఉత్సవాల ముగింపు రోజైన నాగులచవితినాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టిడ్కో కాలనీలో నివాసముంటున్న యువకుడు నెట్టి శివ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. గత నెల 25వ తేదీన యలమంచిలి పట్టణంలో నాగులచవితి సందర్భంగా జరిగిన జాతరకు స్నేహితులు దాసరి మధు, మడగల శివలతో కలిసి నెట్టి శివ జాతర చూసేందుకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి సుమారు 10.15 గంటలకు ప్రధాన రహదారికి పక్కనున్న సీతాతులసీ సినిమా హాళ్లకు వెళ్లే దారిలో వెళ్తుండగా శుభయోగ ట్రేడర్స్ పెయింట్ షాపు వద్దకు వచ్చేసరికి రాత్రి 10.30 గంటలకు ఎదురుగా వస్తున్న కశింకోట గువ్వాలు, గొన్నాబత్తుల విఘ్నేషు, వెదుళ్ల మోహన్, కొఠారు రవిల్లో ఒకరికి నెట్టి శివ భుజం తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన నలుగురు యువకులు నెట్టి శివపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శివ రోడ్డుపై పడిపోయినా వదలకుండా ముఖంపై మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో అపస్మారకస్థితికి చేరుకున్న నెట్టిశివను స్నేహితులు ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. అపస్మారకస్థితికి చేరుకున్న శివను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం శివను అక్కడ్నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నెట్టి శివ మెదడులో రక్తస్రావమైనందున గత నెల 26వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స చేశారు.అప్పట్నుంచి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన సోదరుడిపై దాడి చేసిన నలుగుర్ని ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు, ఈ మేరకు జరిగిన ఘటనపై మృతుడు నెట్టి శివ సోదరి సంతోషరాణి ఆదివారం యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు పోలీసులు నమోదు చేసినట్టు తెలిసింది.


