సొంత పొలంలో మట్టి తీసుకెళ్తే పన్ను వసూలా?
● మైనింగ్ చెక్ పోస్టులో
అక్రమ సీనరేజ్ వసూలుపై ఆగ్రహం
● నిలదీసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు
రోలుగుంట: సొంత పొలంలో మట్టిని తవ్వి తీసుకెళ్తే పన్ను వసూలు చేయడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నిండుగొండ జంక్షన్‌లో మైనింగ్ చెక్‌పోస్టులో సీనరీజ్ వసూళ్లపై సంబంధిత సిబ్బందిని ఆయన ఆదివారం సాయంత్రం నిలదీశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మైనింగ్ మాఫియా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించారు. గ్రామాల్లో తమ సొంత పొలంలో మట్టిని తీసుకెళ్లినా సరే రూ.300 నుంచి రూ.500 వరకు మైనింగ్ చెక్ పోస్టుల్లో సీనరీజ్ వసూలు చేస్తుండడం దారుణమన్నారు. క్వారీల వద్ద వే బిల్లు ఉన్నా.. లేకపోయినా సరే నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆన్‌లైన్ చెల్లింపు బిల్లు ఇవ్వాలన్న నిబంధనలు పాటించకుండా నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. మాఫియాను అరికట్టకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ సీనరీజ్‌కు సంబంధించిన ఫారంను ఈ సందర్భంగా ఆయన విలేకర్లకు చూపించారు.
సొంత పొలంలో మట్టి తీసుకెళ్తే పన్ను వసూలా?


