వైఎస్సార్‌సీపీ నేత తాతీలుకు బెయిల్ మంజూరు
● తుపాను సహాయక కార్యక్రమాలపై
పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన తాతీలు
● దీంతో అక్రమ కేసు బనాయింపు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీకి చెందిన రాజయ్యపేట మాజీ ఎంపీటీసీ పిక్కితాతీలకు యలమంచిలి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు అరెస్టు చేసి 24 గంటలు గడవక ముందే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం రాత్రి ఆయన విడుదలయ్యారు. మోంథా తుపాను సమయంలో గ్రామస్తులందరికీ భోజన సదుపాయం కల్పించకపోవడంపై పంచాయతీ కార్యదర్శిని పిక్కితాతీలు నిలదీశారు. దీంతో పిక్కితాతీలు,12 మంది తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిక్కితాతీలు, తదితరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచిన వెంటనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా, బల్క్‌గ్రడ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న నేతలపై అక్రమ కేసులు బనాయించి ఆందోళనను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మత్స్యకారులపై అక్రమ కేసులు బనాయిస్తోందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. పిక్కితాతీలు తదితరులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ పరామర్శించారు.
పిక్కితాతీలుతో మాట్లాడుతున్న వీసం రామకృష్ణ


