
విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ అన్యాయం
చోడవరం: విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బి. బాబ్జి పిలుపు ఇచ్చారు. గుంటూరులో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్లను శుక్రవారం ఆయన చోడవరంలో ఆవిష్కరించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 600కోట్లు ఇప్పటి వరకూ విడుదల చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయన్నారు. తక్షణం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లు పూర్తిగా యాజమాన్యాలకు ఇవ్వడం అన్యాయమని, హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు నాగదుర్గ, రాజు, నాయుడు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.