
ఆటో డ్రైవర్లకు మద్దతుగా సైకిల్ యాత్ర
సైకిల్ యాత్ర చేస్తున్న ఆటో డ్రైవర్ అప్పలరాజుతో ఆటో డ్రైవర్లు
అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని, వారికి ఉపాధి లేకుండా పోయిందని గాజువాక 86వ ఆటో యూనియన్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి విజయవాడ వరకూ శుక్రవారం ఉదయం 9 గంటలకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. అనకాపల్లి నెహ్రూచౌక్ బస్టాండ్ వద్దకు చేరుకున్న అప్పలరాజుకు స్థానిక ఆటోడ్రైవర్లు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రోజుకు 50 కిలోమీటర్లు మేర సైకిల్ యాత్ర చేసి, రాత్రిళ్లు దేవాలయాల వద్ద బస చేస్తానన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. వాహన మిత్ర పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, రోజుకు ఆటో డ్రైవర్లకు రూ.41 మాత్రమే వస్తుందన్నారు. కార్యక్రమంలో నెహ్రూచౌక్ ఆటో యూనియన్ డ్రైవర్లు బీమవరపు శ్రీను, సంతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.