
తాచేరు డైవర్షన్ రోడ్డు పనులపై ఎందుకీ కక్ష?
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి మూడు జిల్లాల ప్రజలు తీవ్ర రవాణా కష్టాలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జోరు వర్షంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి విజయరామరాజుపేట తాచేరు నదిపై కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డును పరిశీలించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి బీఎన్ రోడ్డు విస్తరణ కోసం రూ.110 కోట్లు మంజూరు చేయించామని అమర్‌నాథ్ తెలిపారు. అప్పట్లో ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కావాలనే రోడ్డు పనులు చేయకుండా, కూలిన వంతెనలు కట్టకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. నెల రోజుల కిందట వర్షాలకు డైవర్షన్ రోడ్డు కోతకు గురైందన్నారు. మరమ్మతు పనులకు రూ.15 లక్షలు మంజూరు కాగా.. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పది రోజులైనా నేటికి పనులు ప్రారంభించకపోవడంపై ఆయన మండిపడ్డారు. కావాలనే తాచేరు వంతెన, డైవర్షన్ రోడ్డు పనులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండగా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ కక్ష సాధిస్తోందని ఆరోపించారు.
సంక్రాంతికి రోడ్లు బాగు ఎక్కడ?
అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగు చేస్తామని గతేడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని అమర్‌నాథ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా బీఎన్ రోడ్డు బాగు పడలేదన్నారు. ఏ రోడ్డును చూసినా పెద్ద పెద్ద గోతులు, వర్షపు నీరు, మట్టి దిబ్బలతో దీవులను తలపిస్తున్నాయన్నారు. ప్రజల రవాణా కష్టాలు తీర్చడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల ప్రజలు బీఎన్ రోడ్డులో ఉన్న విజయరామరాజుపేట మీదగా రాకపోకలు సాగిస్తారన్నారు. డైవర్షన్ రోడ్డు గండి కారణంగా గౌరీపట్నం, తదితర ఇరుకు రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతున్నారన్నారు. అయినా కూటమి నేతలు, ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడం సరికాదన్నారు. పేట డైవర్షన్ రోడ్డు మరమ్మతులు చేపట్టి రవాణా కష్టాలు తీర్చకపోతే ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, నాయకులు జోగా కొండబాబు, నమ్మి అప్పలరాజు, గుమ్మిడి ప్రసాద్, కోరుకొండ రమణ, ఎల్లపు విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అప్పుడు, ఇప్పుడు టెండర్లు దక్కించుకున్నది టీడీపీ కాంట్రాక్టర్లే
పనులు పూర్తి చేయకుండా కాలయాపన
మూడు జిల్లాల ప్రజల కష్టాలు కనిపించడం లేదా?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆగ్రహం
జోరువానలో పేటలో డైవర్షన్ రోడ్డు పరిశీలన

తాచేరు డైవర్షన్ రోడ్డు పనులపై ఎందుకీ కక్ష?