
స్మార్ట్ రేషన్ కార్డులు ఎక్కడ?
సాక్షి, అనకాపల్లి: రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న ‘కూటమి’ నేతలు కార్డుల పంపిణీకి వారే అడ్డంకిగా నిలిచారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్మార్ట్ కార్డుల పంపిణీని ఈనెల 10వ తేదీన ప్రారంభించాలి. కార్డులు సిద్ధమైనా జిల్లాలోని కేవలం 2 మండలాల్లో మాత్రమే పంపిణీ మొదలైంది. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లోని 1063 రేషన్ డిపోల పరిధిలో 5,32,346 రేషన్ కార్డుదారులున్నారు. కనీసం ఇంతవరకు రెండు వేల స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ జరగలేదు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పంపిణీని ప్రారంభించాలని అధికారులకు అనధికార ఆదేశాలున్నాయి. వారు ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేయడంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు కూడా ఇందుకు తోడయ్యాయి. మేమంటే మేమని ఒకరితో ఒకరు పోటీ పడుతూ పంపిణీకి బ్రేకులు వేస్తున్నారు.
కొత్త కార్డుదారులకు నిరాశ
స్మార్ట్ కార్డులు అందించకపోవడంతో కొత్తగా కార్డులు మంజూరైన 3,250 కుటుంబాలు రేషన్ అందక విలవిల్లాడుతున్నాయి. అధికారులు వీరి కోసం సరకులు రిలీజ్ చేశారు. కానీ వారి వద్ద ఎలాంటి కార్డు లేక పంపిణీ చేయలేని పరిస్థితి. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెండు మండలాల్లో హడావుడిగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా చోట్ల స్మార్ట్ ఈ–పోస్ యంత్రాలు, క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు మూలుగుతున్నాయి. కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల డేట్లు లేకపోవడంతో స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం జరగడం సరికాదని అన్నారు. తాను సీఎం కార్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన అనంతరం రెండు మండలాల్లో శుక్రవారం తూతూ మంత్రంగా ప్రారంభించారని చెప్పారు.
10న ప్రారంభం కావాల్సిన పంపిణీ
‘కూటమి’ నేతల పెత్తనంతో ఆలస్యం
కొత్త కార్డులకు నిలిచిన రేషన్ పంపిణీ
ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు
కేవలం 2 మండలాల్లోనే పంపిణీ ప్రారంభం