
పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్
యలమంచిలి రూరల్: భారీగా పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ప్రధాన, అంతర్గత రహదారుల్లో ఎక్కడైనా ట్రాఫిక్ స్తంభిస్తే వెంటనే అక్కడకు చేరుకుని క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు సవాలుగా తయారైంది. మరోవైపు గొడవలు, అల్లర్లు, ఘర్షణలు జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించడం పోలీసులకు కత్తి మీద సాములా పరిణమించింది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా పోలీసు శాఖ పలు ఠాణాలకు అన్ని సౌకర్యాలతో కొత్త ద్విచక్ర వాహనాలను అందజేసింది. పరవాడ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 5 పోలీస్ స్టేషన్లకు పెట్రోలింగ్ బైకులను కేటాయించారు. యలమంచిలి పట్టణం, యలమంచిలి ట్రాఫిక్, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం ఠాణాలకు కేటాయించిన ఈ సరికొత్త వాహనాలు సంబంధిత సిబ్బందికి విధి నిర్వహణలో చాలా సౌకర్యవంతంగా, ఉపయుక్తంగా ఉన్నాయి.
ఇటీవల ఆయా ఠాణాలకు అందజేసిన టీవీఎస్ అపాచీ బ్రాండ్‌కు చెందిన ఈ బైకులకు అనేక ప్రత్యేకతలున్నాయి. ట్రాఫిక్ స్తంభించిన సమయాల్లో, ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వేగంగా ఘటనాస్థలికి చేరుకుని, వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి కొత్త వాహనాలు ఉపయోగపడుతున్నాయి.
ప్రత్యేకతలు
●బైక్‌కు వెనుక భాగాన ఎర్రటి బుగ్గ బల్బు, బ్లూ, ఎర్ర రంగు లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతాయి. వాటి పక్కన మైక్‌లు ఉన్నాయి. అదే క్రమంలో సైరన్ కూడా మోగుతుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు మైక్ ద్వారా సూచనలు చెబుతూ పోలీసులు పరిస్థితిని క్రమబద్ధీకరిస్తున్నారు.
●ప్రమాదాలు జరిగిన ప్రాంతంలోనే బైక్‌ను నిలిపి ప్రజలను అప్రమత్తం చేయవచ్చు.
●ఊరేగింపులు, ర్యాలీల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలో మైకుల ద్వారా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేయొచ్చు.
●ఎక్కడైనా ట్రాఫిక్ నిలిచిపోయి డయల్ 112కు ఫిర్యాదు వస్తే వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
●పోలీసు జీపులు, పెద్ద వాహనాలు చిన్నపాటి సందుల్లో వెళ్లలేవు కాబట్టి ఈ ద్విచక్ర వాహనాలతో సులువుగా ఘటనా స్థలానికి చేరుకోవచ్చు.
●రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.
●వాహనంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు శ్వాస పరీక్షలు చేసే పరికరం కలిగిన పెట్టే కూడా ఉంది.
పెట్రోలింగ్‌కు బాగా ఉపయోగం
ఈ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. గస్తీ సులభంగా ఉంటోంది. ఈ వాహనాల్లో ఇన్‌బిల్ట్ సైరన్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు, అల్లర్లకు పాల్పడే వారిని చెదరగొట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. తొలి విడతలో 5 పోలీస్ స్టేషన్లకు ఇచ్చాం. మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని ఠాణాలకు సమకూర్చితే సంబంధిత సిబ్బందికి సౌకర్యవంతంగా ఉంటుంది.
– వి.విష్ణుస్వరూప్, డీఎస్పీ, పరవాడ

పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్

పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్

పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్

పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్