
వడ్డాదిలో వర్ష బీభత్సం
బుచ్చెయ్యపేట: మండలంలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. మేజర్ పంచాయతీ వడ్డాదిలో రెండిళ్లకు చెందిన ప్రహరీలు కూలిపోయాయి. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో బీఎన్ రోడ్డు వద్ద వేంకటేశ్వరస్వామి ఆర్చ్ దగ్గరలో చంద్రశేఖర్ ఇంటి ప్రహరీ కూలిపోయి పక్కనే ఉన్న సయ్యపురెడ్డి శ్రీను ఇంటి ప్రహరీపై పడింది. దీంతో ఆ గోడ కూడా కూలిపోయింది. ఆయా ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
– వడ్డాది పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహానికి నదిపై ఉన్న శిథిల వంతెనపై మళ్లీ రంధ్రం పడింది. గతంలో రంధ్రం పడి గొయ్యి పడటంతో ఆర్‌అండ్‌బీ అధికారులు గొయ్యిని పూడ్చారు. నీటి ఉధృతికి మళ్లీ వంతెన వద్ద గొయ్యి పడటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా స్థానికులు గొయ్యి చుట్టూ రాళ్లు పేర్చి హెచ్చరికలు జారీ చేశారు.