ఆటోలో...రక్తపు మడుగులో... | - | Sakshi
Sakshi News home page

ఆటోలో...రక్తపు మడుగులో...

Sep 11 2025 2:41 AM | Updated on Sep 11 2025 11:23 AM

అడ్డూరు సమీపంలో ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఆటో డ్రైవర్‌ మృతి..ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలు

ఒకరి పరిస్థితి విషమం

సహాయం అందక గంటపాటు విలవిల

క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు

పెద్దకర్మకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం

చోడవరం: వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెనుగుపూడి నుంచి గాజువాక వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌ కురుచా భూషణం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 

వివరాల్లోకి వెళితే... చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన కురచా భూషణం, కురచా నాయుడు, కురచా వరాహమూర్తి, మతల వరాహమూర్తి, కురచా శంకర్‌ జీవనోపాధి రీత్యా గత కొంతకాలంగా గాజువాకలో నివాసం ఉంటున్నారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి భూషణం ఆటోలో వీరంతా మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరుకు సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వీరు ప్రయాణిస్తున్న ఆటో నుజ్జునుజ్జయింది. 

ఆటో డ్రైవర్‌ భూషణం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. వీరిలో కురచా శంకర్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. మృతుడు భూషణానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రుల్లో కురచానాయుడు విశాఖ డెయిరీలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా మిగతా వారు ఎస్‌ఆర్‌ఎంటీలో పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు స్వగ్రామమైన జైతవరంలో ఉంటుండగా భార్యా పిల్లలతో కలిసి వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే జైతవరం గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు సీఐ అప్పలరాజు చెప్పారు.

గంటపాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో క్షతగాత్రులు

108 అంబులెన్స్‌ రాకపోవడంతో సుమారు గంటపాటు క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడారు. బస్సు ఢీకొనడంతో ఆటో ముందుభాగం పూర్తిగా ధ్వంసమై ఆటోలో కూర్చొని గాయాలపాలైన వారంతా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అటుగా వెళుతున్న వారంతా సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో క్షతగాత్రులంతా ఉండటం వల్ల సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర రోదనల మధ్య క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే గంటపాటు ఉండిపోయారు. వైద్యం ఆలస్యం కావడం వల్లే తలకు బలమైన గాయమై ఎక్కువ రక్తం పోయిన కురచా శంకర్‌ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అక్కడి వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

సకాలంలో స్పందించిన చోడవరం పోలీసులు

ఫోన్‌ చేసి గంట అయినా 108 అంబులెన్స్‌ రాకపోవడంతో కొందరు చోడవరం పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలరాజుకు ఫోన్‌ చేశారు. ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన జీపులో ఎస్‌ఐతోపాటు సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపారు. వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అందుబాటులో లేని 108 అంబులెన్స్‌ 

ఒకప్పుడు ఫోన్‌ కొట్టిన 20 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకునే 108 అంబులెన్సులు ఇప్పుడు గంటలు గడిచినా రావడం లేదు. దీంతో సకాలంలో వైద్యం అందక అనేకమంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. ఇదే పరిస్థితి అడ్డూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఎదురైంది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టి గంటసేపయినా ఒక్క 108 అంబులెన్స్‌ కూడా ప్రమాదస్థలానికి రాలేదు. అక్కడ ఉన్న వారంతా ఎవరికి వారు 108 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి ప్రమాద విషయం చెప్పినా అంబులెన్స్‌ మాత్రం రాలేదు. గ్రామీణ జిల్లాలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో ఉన్న 108 అంబులెన్సులన్నీ విశాఖపట్నం రిఫరల్‌ కేసులు తీసుకెళ్తున్నాయని, అందుకే కొంత ఆలస్యమవుతుందని కాల్‌సెంటర్‌ నుంచి సమాధానం రావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement