
రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు
నక్కపల్లి: ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ నక్కపల్లికి చెందిన వీరవెంకట రాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఖాళీ ఆటోలతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ పథకం తమ ఉపాధిని దెబ్బ తీసిందని, బేరాలు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వారు ఆందోళన బాట పట్టారు. నక్కపల్లి జాతీయ రహదారిపై వారపు సంత నుంచి వెదుళ్లపాలం జంక్షన్, అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఖాళీ ఆటోలతో ర్యాలీ చేశారు. ఆటోవాలాల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలకు బేరాలకు లేక నక్కపల్లి ఉపమాక రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, వారపు సంత, రాజయ్యపేట ఆటో స్టాండ్‌ల వద్ద రోజంతా ఖాళీగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ డ్రైవర్లు వాపోయారు. ఆటోలపై ఆధారపడ్డ మెకానిక్‌లు, సర్వీసింగ్ చేసేవారు, మొబైల్ రంగంలో పనిచేసేవారు సైతం ఉపాధి కోల్పోయారన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆటోలు కొనుగోలు చేసిన వారు ఉచిత బస్సు కారణంగా ప్రైవేటు ఫైనాన్స్ వారి వద్ద తెచ్చిన అప్పులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘వాహనమిత్ర’ పథకం కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోగా ఉన్న ఉపాధిని దెబ్బ తీసిందన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బేరాలు లేక కుటుంబ జీవనానికి సైతం అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని, కాని పక్షంలో ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా ఆటో డ్రైవర్లకు రూ.30 వేల చొప్పున చెల్లించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కొద్దిసేపు అక్కడ ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైస్ ఎంపీపీ వీసం నానాజీ, సీతంపాలెం ఎంపీటీసీ గొర్ల గోవిందు, ఆటో యూనియన్ నాయకులు శీరం నూకరాజు, దుర్గారావు, రాజు, తాతబాబు, కృష్ణ, నాయుడు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు