
ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా మహాప్రభో?
రావికమతం: చినపాచిలి నుంచి టి.అర్జాపురం వర కు బీఎన్ రోడ్డు పనులు పూర్తి చేయాలని బురదలో కూర్చొని గిరిజనులు బుధవారం నిరసన తెలిపారు. కె.కొట్నాబిల్లి, గదపపాలెం, రామన్నదొరపాలెం, డోలవానిపాలెం, ఎర్రబంద గ్రామాల వారు ఏ అవసరం వచ్చినా ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలి. టి.అర్జాపురం నుంచి మాడుగుల వెళ్లే ప్రజలు కూడా దగ్గరగా ఉంటుందని ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం 2023 అక్టోబర్ నెలలో హై ఇంపాక్ట్ రోడ్డు నిధులు మంజూరు చేసింది. రూ.6.98 కోట్లతో 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు 2024 జనవరిలో పనులు మొదలుపట్టారు. తరువాత ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్డు పనులు కొనసాగలేదు. కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా.. బిల్లులు అందలేదని, అందువల్లనే పనులు నిలిపివేసినట్లు తెలిపారని గిరిజనులు పేర్కొన్నారు. రోడ్డు పనులు తక్షణమే చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాడి బెన్నయ్య, ఎస్.వలసయ్య డిమాండ్ చేశారు.