
నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసన వారం
బుచ్చెయ్యపేట/ఎస్.రాయవరం: ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి నిరసన వారం చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మారావు, దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం వీరు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గద్దె నెక్కి 15 నెలలైనా పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వారం రోజులపాటు రోజుకొక రీతిలో నిరసన తెలుపుతామన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని,1 2వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఇతర పనులు అప్పగించకుండా ఉపాధ్యాయులను బోధనకే వినియోగించాలని, 30 శాతం ఐఆర్ ఇవ్వడంలో ప్రభుత్వం కప్పదాటు వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వారం చేపడతున్నామన్నారు. 11న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత, 15న పాత తాలుకా కేంద్రాల వద్ద నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న ముఖ్యమంత్రి, సీఎస్‌లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపడం చేపడుతున్నామన్నారు.