
దళిత రైతుల సమస్యపై స్పీకర్ స్పందించాలి
ప్లేట్లతో నిరసన తెలుపుతున్న బాధిత రైతులు, సీపీఎం నాయకులు
నర్సీపట్నం: మాకవరపాలెం, జి.కోడూరు క్వారీ బాధితుల నిరసన కార్యక్రమం 50వ రోజూ కొనసాగింది. బుధవారం సీపీఎం నాయకులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. బాధితులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని రోజుల తరబడి దళిత రైతులు నిరసన చేస్తున్నా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా స్పీకర్ స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆర్డీవో, మైనింగ్ అధికారులు బాధిత రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. క్వారీ నిర్వహణ వల్ల సాగు చేసుకుంటున్న జీడి మామిడి తోటలు నాశనమవుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు, రైతులు అప్పారావు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.