
రోజూ 500 క్యూసెక్కుల నీరు విడుదల
తాండవ కాలువలో నీటిని పరిశీలిస్తున్న జేఈ శ్యామ్‌కుమార్
నాతవరం : ఖరీఫ్ పంట సాగుకు రెండు కాలువల ద్వారా రోజు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తాండవ జేఈ శ్యామ్‌కుమార్ చెప్పారు. ఆయన బుధవారం రెండు జిల్లాల సరిహద్దులో శివారు ఆయకట్టు భూములకు ప్రవహిస్తున్న తాండవ ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 375.3 అడుగులు ఉందన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాదస్థాయి నీటిమట్టం 380 అడుగులు, డెడ్ స్టోరేజీ నీటి మట్టం 345 అడుగులుగా పరిగణిస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు తాండవ నుంచి ఆగస్టు 10న ఆయకట్టుకు నీరు విడుదల చేశామని గుర్తు చేశారు. వర్షాలు బాగా కురవడంతో నీటిని పంట కాలువలు ద్వారా విడుదల చేసినా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గలేదన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులు నీరు పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ వర్కు ఇన్‌స్పెక్టరు అప్పారావు సిబ్బంది ఉన్నారు.