అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం

Sep 10 2025 3:31 AM | Updated on Sep 10 2025 3:31 AM

అన్నద

అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం

నర్సీపట్నం: రైతులకు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పార్టీ నాయకులను హౌస్‌ అరెస్టులు చేయించింది. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, స్పెషల్‌పార్టీ పోలీసులు మోహరించారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు వివిధ మార్గాల్లో ఆందోళన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మున్సిపల్‌ స్టేడియంలో గాంధీ విగ్రహం, అబీద్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే గణేష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అడ్డుకోవడం భావ్యం కాదని గణేష్‌ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో లేకపోవడంతో కార్యాలయ ఏవో సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.

అయ్యన్నపాత్రుడికి తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలే..

ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, బాధ్యత గుర్తు చేసేందుకు తాము శాంతియుతంగా నిరసన చేపడితే భగ్నం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిందన్నారు. వ్యవసాయం గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు వ్యవసాయం గురించి అయ్యన్నపాత్రుడికి ఏమి తెలుసునని గణేష్‌ మండిపడ్డారు. ఆయనకు తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలేనన్నారు. లేటరైట్‌ ద్వారా స్పీకర్‌ రోజుకు రూ.3 కోట్లు వెనకేసుకుంటున్నారన్నారు. రోలుగుంట క్వారీల ద్వారా నెలకు రూ.50 లక్షలు, జి.కోడూరు క్వారీ ద్వారా కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలియలేదంటే.. జగనన్న పెట్టిన రైతు భరోసా కేంద్రాలు అయ్యన్నపాత్రుడి గుండెల్లో ఎంతగా నాటుకుపోయాయో అర్థమవుతోందన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని స్పీకర్‌ అనుకుంటే సరిపోదని, గ్రామాల్లోకి వెళితే ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో 4015 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 1500 టన్నులు సరఫరా చేశామని అధికారులే చెబుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, యూత్‌ వింగ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌.వరుణ్‌, పార్టీ టౌన్‌ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ నర్సీపట్నం మండల అధ్యక్షుడు శానపతి వెంకటరత్నం, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, బేతిరెడ్డి రత్నం, వీరమాచినేని జగదీశ్వరి, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ రోజా, పార్టీ నాయకులు పెట్ల భద్రాచలం, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం 1
1/1

అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement