
విశ్రాంత హోంగార్డుకు రూ.4.04 లక్షల చెక్కు
అనకాపల్లి: హోంగార్డుల విధులు పోలీస్‌శాఖలో అంతర్భాగమేనని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో హోంగార్డుగా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన సీంద్రి కోమలకు రూ.4,04,890ల చెక్కును మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రిటైరైన లేదా మరణించిన హోంగార్డులకు రెండు జిల్లాల హోంగార్డులు ఒకరోజు వేతనం స్వచ్ఛందంగా అందజేస్తున్నారని చెప్పారు. సీంద్రి కోమల విధులను నిబద్ధతతో, విశ్వాసపాత్రంగా నిర్వర్తించారని, ఆమె సేవలు ప్రశంసనీయమన్నారు. ఎస్పీ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్.తిలక్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.