
ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై కూటమి దెబ్బ
అనకాపల్లి/తుమ్మపాల: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గోవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్, రాపిడో, తదితర ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వ యాప్‌తో సర్వీసులు చేపట్టాలని కోరారు. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.25వేలు అందించాలన్నారు. ఇన్సూరెన్స్‌తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అధిక జరిమానాలు విధించే జీవో నంబర్లు 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి వేల్పువీధి జంక్షన్, పెరుగుబజార్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకూ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణ, జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మార్కండేయులు, సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాపునాయుడు, నాయకులు కె.నాగరాజు, అంజి, కోరిబిల్లి రామప్పారావు, వెంకటేష్ పాల్గొన్నారు.
● పట్టణంలో పలు ఆటో యూనియన్ సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.శ్రీనివాసరావు, రుత్తల శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 18న విజయవాడలో తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గణపతి, శంకర్, ఎస్.కె.సుభాని, శ్రీనివాసరావు, కాళీ, రమణ, తదితరులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై కూటమి దెబ్బ