
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కోరిన మత్స్యకారులు
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, ఈ ప్రాంత మంతా కాలుష్య కాసారమవుతుందని మండలంలో రాజయ్యపేట, బోయపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు కోడ లక్ష్మణ్, పిక్కి చిట్టిబాబు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. మంగళవారం వారు తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిిసి బల్క్ డ్రగ్‌పార్క్ వల్ల కలిగే నష్టాలను, ఈ ప్రాంత మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు గురించి వివరించారు. స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తోందన్నారు. గత నెలలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మత్స్యకారులు బల్క్‌డ్రగ్‌పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
సభలో తమ అభిప్రాయాలు చెప్పకుండా పోలీసుల సాయంతో తమను సభ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించడం జరిగిందని, లక్ష్మణ్, చిట్టిబాబు తెలిపారు. కోస్టల్ కారిడార్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీలు, ఫిిషింగ్ హార్బర్లు, రిసార్ట్స్, టూరిజం పార్క్‌లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లింపులో ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ తరపున సంఘీభావం ప్రకటించి గంగపుత్రుల ప్రాణాలు కాపాడాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరడం జరిగిందన్నారు. తమ సమస్యలను పూర్తిగా విన్న జగన్ సానుకూలంగా స్పందించారని, మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు.

బల్క్‌డ్రగ్ పార్క్ ఉద్యమానికి సహకరించండి