
క్వారీ బాంబు పేలుళ్ల బాధితులకు భరోసా
రోలుగుంట: మండలంలో రాజన్నపేటలో క్వారీలో బ్లాస్టింగు వల్ల దెబ్బతిన్న గృహాలను, రహదారులను తహసీల్దార్ సీహెచ్ నాగమ్మ మంగళవారం పరిశీలించారు. రెండు మాసాల క్రితం శరభవరం, రాజన్నపేట సమీపంలో క్వారీలో బాంబు పేలుళ్లు చేపట్టారు. దాంతో రాజన్నపేటలో పలు గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లకు పగుళ్లు ఏర్పడి నష్టం వాటిల్లింది. ఈ సమస్యను బాధితులు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాజన్నపేటలో ఈ నెల 7న బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో అధికారుల తీరుకు నిరసన చేపట్టారు. దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆర్డీవో వి.వి. రమణ స్పందించి గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకోవాలని తహసీల్దార్ నాగమ్మను ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఆర్‌ఐ రామ్మూర్తితో రాజన్నపేటలో పరిశీలించారు. ఆర్డీవోకి నివేదికలు అందజేస్తానని గ్రామస్తులకు తెలియజేశారు.