
మోకాలిలో కిలోన్నర కణితి తొలగింపు
నక్కపల్లి: స్థానిక 50 పడకల ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మోకాలిలో కిలోన్నర కణితిని ఆర్ధోపెడిక్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఉద్దండపురం గ్రామానికి చెందిన తుమ్మల రాజారావు విపరీతమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాలు బరువుగా ఉండటంతో నడవలేని పరిస్థితి నెలకొంది. ఇతను వైద్యం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్‌ను కలిశాడు. వెంటనే ఎక్స్‌రే తీసి మోకాలిలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చేర్చుకుని శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. తొలగించిన కణితి బరువు 1.50 కిలోలు ఉంటుందని డాక్టర్ తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. బాధితుడు రాజారావు మాట్లాడుతూ ఎంతోకాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద నొప్పి కోసం మందులు వాడేవాడినన్నారు. నక్కపల్లిలో ఆర్ధోపెడిక్ సర్జన్ ఉన్న విషయం తెలుసుకుని ఇక్కడకు వస్తే ఆపరేషన్ చేశారన్నారు. ఇదే కణితిని ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి తొలగిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. తొలిసారిగా ఇటువంటి కణితిని తొలగించినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ రవికిరణ్‌ను సూపరింటెండెండ్ డాక్టర్ శిరీష, సహచర వైద్య సిబ్బంది అభినందించారు.
నక్కపల్లి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స

మోకాలిలో కిలోన్నర కణితి తొలగింపు