
మహా సముద్రాలు సంపదకు నిలయాలు
పాయకరావుపేట: మహా సముద్రాలు సంపదకు నిలయాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డాక్టరు గిడుగు రామదాస్ తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో సముద్ర సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామదాస్ హాజరై మాట్లాడుతూ మహా సముద్రాలను కాపాడుకోవాలన్నారు. సముద్రాల నుంచి వచ్చిన అపరిమితమైన వనరులు, వాటిని పొందేందుకు, అధ్యయనం చేసేందుకు ఉపయోగించే పరికరాలు, వాటి సాంకేతికతను వివరించారు. ఇటీవల సముద్రయాన్ అభియాన్ ద్వారా మత్స్య 6000 అనే జలాంతర్గామిని రూపొందించి మానవులను ఆరు వేల అడుగుల లోతుకు పంపగలిగామన్నారు. ఈ విజయంతో భారతదేశం ప్రపంచంలో ఆరో దేశంగా అవతరించిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ డాక్టరు రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.